
సాగులో కొత్త పుంతలు
● సంప్రదాయ సాగుకు భిన్నంగా..
● అధునాతన యంత్రాల వినియోగం
● డ్రోన్ల సాయంతో మందుల పిచికారీ
దుద్యాల్: పంటల సాగులో రైతులు నూతన పద్ధతులు అవలంబిస్తున్నారు. సంప్రదాయ సాగుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. విత్తనం వేయడం మొదలు.. పంట కోత వరకు యంత్రాలను వినియోగించి సాగు ఖర్చులు, శ్రమ తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం యంత్రాల వాడకం భారీగా పెరిగింది. దుక్కి దున్నడం మొదలుకొని పంటల కోతలు, పంట నూర్పిళ్ల వరకు వాటినే వినియోగిస్తున్నారు. వ్యవసాయంలో ఎద్దుల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. గతంలో రోజుల తరబడి పొలం పనులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రోటావేటర్ల వినియోగిస్తున్నారు. వరి నాట్లకు డ్రమ్ సీడర్ వాడుతున్నారు. పంట కోతకు వివిధ రకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. పంట నూర్పిడికి సైతం యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో శ్రమ తగ్గిందని రైతులు అంటున్నారు. పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినదని, సమయం కూడా కలిసొస్తుందని పలువురు పేర్కొన్నారు.
ఖర్చు తక్కువ
పూర్వం వ్యవసాయం చేయాలంటే రోజుల తరబడి పొలంలోనే పని చేయాల్సి వచ్చేది. కాడెద్దుల సహాయంతో ఒక ఎకరం పొలాన్ని దుక్కి చేయడానికి ఒక రోజు సమయం పట్టేది. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో గంటలోనే పని పూర్తవుతోంది. వరి పంట నూర్పిడికి సుమారు 10 రోజులు పట్టేది. ప్రస్తుతం యంత్రాల సాయంతో గంటల్లో ఈ ప్రక్రియ పూర్తవుతోంది. కూలీల ఖర్చు ఉండదు. సమయం కూడా ఆదా అవుతోంది.
– పిట్ల మొగులప్ప, రైతు, ఈర్లపల్లి

సాగులో కొత్త పుంతలు