కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలి
కొడంగల్: కొడంగల్‌ను విద్యా కేంద్రంగా మార్చాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నోటికి నల్ల క్లాత్ కట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేష్, ఎరన్‌పల్లి శ్రీనివాస్, పవన్‌కుమార్ లాహోటీ, రమేష్‌బాబు, గౌసన్ మాట్లాడారు. కొడంగల్ బచావో నినాదంతో నిరసన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి మంజూరు చేసిన మెడికల్ కళాశాలను మండలంలోని అప్పాయిపల్లిలో, గురుకులాలను మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్‌లో నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ కళాశాల, గురుకులాల తరలింపుపై ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి తగిన చొరవ తీసుకొని కొడంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నావాజ్, రాజేందర్, భీంరాజు తదితరులు పాల్గొన్నారు.


