జోరుగా జూదం
బషీరాబాద్: దీపావళి పండుగ నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా పేకాట సాగింది. ప్రత్యేక స్థావరాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు రూ.లక్షల్లో బెట్టింగ్ సాగినట్లు తెలుస్తోంది. తాండూరు పట్టణ సమీపంలోని ఓ క్లబ్‌లో బడాబాబులు మద్యం సేవిస్తూ యథేచ్ఛగా మూడు ముక్కలాట ఆడినట్లు సమాచారం. జహీరాబాద్ మార్గంలోని ఓ లాడ్జీలోనూ కొంత మంది జూదరులు గ్రూపులుగా ఏర్పడి పేకాట ఆడారు. తాండూరు, బషీరాబాద్, యాలాల మండలాల పరిధిలోని పాలిషింగ్ యూనిట్లతో పాటు పెద్దేముల్ మండలంలోని సుద్ద ఫ్యాక్టరీల్లో మూడుముక్కల ఆట సాగింది. పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టారు. బషీరాబాద్‌కు చెందిన 5 మంది పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం దేవందర్ అనే వ్యక్తి పొలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ నుమాన్ అలీ తన సిబ్బంధితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో బషీరాబాద్‌కు చెందిన సలీం, అజీం, బోయిని రవి, షేక్ షబ్బీర్, ఈడిగి చంద్రశేఖర్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు.


