అందని ఆసరా.!
● నాలుగేళ్లుగా నిలిచిన
కొత్త పింఛన్ల మంజూరు
● ఆశగా ఎదురుచూస్తున్న పేదలు
● నూతన ప్రభుత్వం వచ్చినా కదలని ఫైల్
దౌల్తాబాద్: నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం కొత్త పెన్షన్ల మంజూరు నిలిపివేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చాక కొత్త వారికి అవకాశం వస్తుందని ఆశించిన అర్హులు మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ అందుతుంది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని మరో రెండు వేల రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. 22 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని అర్హులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం వద్దే పెండింగ్
కుటుంబ యజమాని అంటే ఆసరా పెన్షన్ వచ్చే భర్త ఏదైనా కారణంతో మరణిస్తేనే అతడి స్థానంలో భార్యకు మంజూరు అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్తవారికి పెన్షన్ మంజూరు కావడంలేదని చెబుతున్నారు. నాలుగైదేళ్లుగా ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉందని వెల్లడిస్తున్నారు. ఎవరైనా కొత్తవారు దరఖాస్తు ఇస్తే తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఆప్షన్ లేదని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే కొత్తవారి నుంచి దరఖాస్తులు తీసుకుని అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
లబ్ధిదారుల వివరాలు
ప్రభుత్వ ఆదేశాలు రావాలి
కొత్త పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. ఇప్పటి వరకు కేవలం భర్త చనిపోతే భార్యకు పింఛన్ మంజూరుకు అవకాశం ఉంది. మిగతా వాటికి ఆదేశాలు వస్తే దరఖాస్తులు స్వీకరిస్తాం.
– శ్రీనివాస్, ఎంపీడీఓ


