
దీపావళి సౌభాగ్యం నింపాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
అనంతగిరి: జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిరు దివ్వెలతో చీకట్లను పారదోలి వెలుగులు పంచాలని కోరుకున్నారు. పేదలు, రైతుల జీవితాల్లో కొత్తకాంతులు నింపడానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
కుల్కచర్ల: గ్రూప్–2 నియామక ప్రక్రియలో భాగంగా కుల్కచర్ల మండలానికి చెందిన మురళీకృష్ణ నాయక్ కో–ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్‌గా శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పత్రాన్ని అందుకున్నారు. ఇప్పాయిపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం రోకటిగుట్టతండాకు చెందిన మురళీకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి నారాయణపేట జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్‌గా నియమితులయ్యారు. కాగా మండలానికి చెందిన యువకుడు జిల్లా స్థాయి ఉద్యోగాన్ని పొందడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు గంటలు నిలిచిన ప్యాసింజర్ రైలు
తాండూరు టౌన్: సాంకేతిక లోపం వలన ఓ ప్యాసింజర్ రైలు తాండూరు రైల్వే స్టేషన్‌లో రెండు గంటల పాటు నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. వాడి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన వాడి ప్యాసింజర్ రైలు.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాండూరుకు చేరుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో మొరాయించింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. మెకానిక్‌లు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడికి వచ్చిన ఓ గూడ్స్ ఇంజన్‌ను ప్యాసింజర్ బోగీలకు అమర్చి, రైలును సికింద్రాబాద్‌కు తరలించారు. దీంతో రెండు గంటల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
షాద్‌నగర్: దీపావళి పండుగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్–బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో ఉన్న జడ్చర్ల ఎక్స్‌ప్రెక్స్ వే టోల్‌ప్లాజా వాహనాలతో రద్దీగా మారింది.
ఏఐసీసీ పరిశీలకుడు రాబర్ట్ బ్రూస్
తుర్కయంజాల్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయంజాల్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు.

దీపావళి సౌభాగ్యం నింపాలి

దీపావళి సౌభాగ్యం నింపాలి