
పండగ పూట.. పేకాట!
స్పెషల్ డ్రైవ్ చేస్తాం
బషీరాబాద్: జూదానికి వ్యసనమై ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మూడు ముక్కలాటలో కొందరు సర్వం కోల్పోయి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. దీపావళి సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో పేకాట ఆడడం ఆనవాయితీగా మారింది. జూదాన్ని అరికట్టాల్సిన పోలీసులు పేకాటరాయుళ్ల ముడుపులకు అలవాటుపడి అటువైపు కూడా కన్నెత్తి చూడడంలేదనే విమర్శలు బహిరంగా వినిపిస్తున్నాయి. వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు మొదలుకొని కార్మికుల వరకు కార్డ్స్ ఆడడం అలవాటుగా మారింది. దీంతో తాండూరులో మూడు ముక్కలు.. అరవై ఆటలుగా పేకాట నడుస్తోంది.
ఏళ్ల నుంచి ఆచారం
జిల్లాలో తాండూరు వాణిజ్య కేంద్రంగా పేరొందింది. ఇక్కడ నాపరాతి, సుద్ద గనుల వంటి విలువైన ఖనిజ సంపద విరివిగా ఉండడంతో వ్యాపారాలు, ఉపాధి ఎక్కువ లభిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ దుబాయ్ అని కూడా పిలుస్తుంటారు. దీపావళి సందర్భంగా వ్యాపారులు తమ షాపుల్లో లక్ష్మీ పూజతో పాటు రాత్రి తప్పనిసరిగా పేకాట ఆడటం సంవత్సరాల నుంచి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది.
శిబిరాల ఏర్పాటు
వ్యాపారులు కొంతమంది సిండికేట్‌గా మారి తమ షాపులు, ఇళ్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకొని పందేలు కాస్తూ పేకాట కొనసాగిస్తున్నారు. పట్టణంలోని గంజి అర్తుల్లో పూజల అనంతరం పేకాట ఆడడం నిబంధనగా పెట్టుకున్నారు. మరికొందరు ఫంక్షన్ హాళ్లలోని గదుల్లో, లాడ్జీల్లో, పట్టణ శివారు ప్రాంతల్లోని ఫామ్‌హౌస్‌ల్లో, పాలిషింగ్ యూనిట్లలో, పొలాల బావుల దగ్గర తీన్‌పత్తా ఆట జోరుగా సాగిస్తున్నారు. ఇవీ అసాంఘిక కార్యక్రమాలని తెలిసిన వాళ్లు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. పండుగ 15 రోజుల్లోనే రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి.
ముడుపుల ఆరోపణలు
ఈ వ్యవహారంలో ఎక్కువగా బడాబాబులే ఉండడంతో పోలీసులు దాడులు చేయడానికి జంకుతున్నారు. 5 ఏళ్లుగా తాండూరు పట్ణణంతో పాటు మండలాల్లోనూ ఎక్కడ పోలీసుల దాడులు చేయలేదు. పేకాటరాయుళ్లు పోలీసులకు ముడుపుల మేత వేసి దర్జాగా ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ కూడా దాడులు జరపవద్దని ఓ పోలీసు అధికారి వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్‌లో ఆదేశాలు ఇచ్చారని అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. పేకాట రాయుళ్ల నుంచి రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పడంతో కనీసం రాత్రివేళ పోలీసు జీపుల సైరన్ కూడా వినిపించడంలేదని విమర్శలు వస్తున్నాయి.
దీపావళి పూజల్లో పేకాట ఆడుతుంటారని మా దృష్టికి వచ్చింది. బెట్టింగులు కట్టి పేకాట ఆడడం చట్ట విరుద్ధం. పట్టణంతో పాటు మండలాల్లో ఎక్కడ జూదం ఆడిన పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ, తాండూరు
జూదరులుగా వ్యాపారులు, రాజకీయ నేతలు
తాండూరు సెగ్మెంట్‌లో జోరుగా పత్తాలాట
రూ.లక్షల్లో కొనసాగుతున్న వ్యవహారం
పట్టించుకోని పోలీస్ యంత్రాంగం