
కిక్కులేని లిక్కర్!
రంగారెడ్డి జిల్లాలో249 మద్యం దుకాణాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లిక్కరుకు ఆశించిన కిక్కు దక్కడం లేదు. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడం.. చేతిలో ఆశించిన స్థాయిలో డబ్బులేక పోవడం.. ప్రభుత్వం లైసెన్స్ ఫీజును భారీగా పెంచడం.. నిర్వహణ ఖర్చులు రెట్టింపు కావడం .. వెరసి మద్యం టెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. తెలంగాణలోనే అత్యధిక లిక్కర్ అమ్మకాలు జరిగే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం అబ్కారీ శాఖను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టెండర్లు పిలిచాం.. దాఖలు చేయండి అంటూ మద్యం వ్యాపారులను అభ్యర్థిస్తుండడం విశేషం.
అడ్డుకుంటున్న సిండికేట్లు
శంషాబాద్ ఎకై ్సజ్ జిల్లా పరిధిలో 111 మద్యం దుకాణాలు ఉండగా, సరూర్‌నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 206, వికారాబాద్ జిల్లాలో 59 దుకాణాలున్నాయి. 2023 ఆగస్టులో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌లోని షాపుల సంఖ్యతో పోలిస్తే.. 2025 సెప్టెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో కొత్తగా 19 దుకాణాలు వచ్చి చేరాయి. గతంలో సరూర్‌నగర్ ఎకై ్సజ్ జోన్ నుంచి 10,994 దరఖాస్తులు రాగా శంషాబాద్‌లో ఎకై ్సజ్ జోన్ నుంచి మరో 10,611 అందాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.432.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. 249 షాపులకు.. సంఖ్య ఇప్పటి వరకు 700 మించలేదు. ఇదిలా ఉండగా సరూర్‌నగర్, శంషాబాద్, గచ్చిబౌలి, హయత్‌నగర్ కేంద్రంగా వెలసిన పలు షాపులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని పలువురు వ్యాపారులు భావిస్తున్నారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి.. కొత్తగా మద్యం వ్యా పారంలోకి వచ్చే వాళ్లను టెండర్‌లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.
గుదిబండగా గుడ్‌విల్స్
గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో షాపుల సంఖ్య పెరిగింది. లైసెన్సు ఫీజును కూడా రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచారు. దీనికి తోడు ఎకై ్సజ్‌కు ప్రతి నెలా గుడ్‌విల్ పేరుతో భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఓపెన్ టెండర్‌లో పాల్గొని మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యాపారులు ఎకై ్సజ్‌శాఖకు గుడ్‌విల్‌గా రూ.రెండు లక్షలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ప్రతినెలా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), డీటీఎఫ్ విభాగానికి ఏడాదికి రెండు విడతల్లో రూ.25 వేల చొప్పున ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇక షాపులకు మద్యం సరఫరా చేసే డిపోలకు ఒక్కో బిల్లుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. అదనపు చెల్లింపులకు తోడు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వెరసి గతంలో ఒక్కో దుకాణానికి సగటున 92 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం మూడు, నాలుగుకు మించడం లేదు. ఎకై ్సజ్ అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. మరో వారం గడువుందని, ఆఖరి నిమిషంలో వచ్చే దరఖాస్తులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
నూతన మద్యం పాలసీ ప్రకారం శంషాబాద్ ఎకై ్సజ్ యూనిట్‌లోని మూడు స్టేషన్ల పరిధిలో మొత్తం 111 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్– 40, శేరిలింపల్లి–44, చేవెళ్ల–27 చొప్పున షాపులు ఉన్నాయి. సరూర్‌నగర్ ఎకై ్సజ్ యూనిట్‌లోని ఆరు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 138 షాపులు ఉన్నాయి. వీటిలో సరూర్‌నగర్– 32, హయాత్‌నగర్–28, ఇబ్రహీంపట్నం–19, మహేశ్వరం–14, ఆమనగల్లు– 17, షాద్‌నగర్–28 షాపులు ఉన్నాయి. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బీసీ గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు పది, ఎస్టీలకు ఐదు శాతం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను బండ్లగూడ జాగీర్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ అకాడమీ (ఈస్ట్)లో స్వీకరిస్తున్నారు. లిక్కర్ షాపు కావాల్సిన వ్యాపారులు స్వయంగా వచ్చి వారి అప్లికేషన్లు సంబంధిత కౌంటర్లలో అందజేయాల్సి ఉంది. ఈనెల 18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆయా దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 23న లాటరీ నిర్వహించనున్నారు.
టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం
ఆసక్తి చూపని వ్యాపారులు
ఇప్పటివరకు వచ్చింది700లోపే దరఖాస్తులు
లైసెన్స్ ఫీజు.. గుడ్‌విల్.. నిర్వహణ ఖర్చు ఎఫెక్ట్
గతంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో రాని అప్లికేషన్లు