
ఆగుతూ.. సాగుతూ!
కానరాని సిగ్నల్ వ్యవస్థ ఇష్టానుసారంగా వాహనాల రాకపోకలు ఆక్రమణలకు గురవుతున్న ఫుట్‌పాత్‌లు కలగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీసులపైనే భారం
మున్సిపాలిటీల్లో జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య
వికారాబాద్: ట్రాఫిక్ సమస్య జిల్లాలో రోజురోజు కూ జఠిలమవుతోంది. ఈ సమస్య ఐదారేళ్ల క్రితమే ప్రారంభమైనా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు లేకపోవడం పెద్ద సవాల్‌గా మారింది.పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ట్రాఫిక్ ఠాణాలు మంజూరు కావడం లేదు. జిల్లా నేతలు పట్టించుకోకపో వడంతో వినతులు బుట్టదాఖలవుతున్నాయి. ప్రధా న కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడం ఇబ్బందులు తెస్తోంది. జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని పలు చోట్ల గతంలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అవి కొద్ది రోజులకే మూలకు చేరాయి. ఫుట్‌పాత్‌లు సై తం ఆక్రమణలకు గురవుతున్నాయి. వ్యాపారులు రోడ్లపైనే తోపుడు బండ్లు ఉంచడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. లా అండ్ ఆర్డర్ పోలీసులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో మొత్తం 2.50 లక్షల వాహనాలు ఉండగా వాటిలో 18వేల పైచిలుకు ట్యాక్సీ ప్లేట్‌కు సంబంధించినవే. వీటితోపాటు నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోయే వాహనాలు వేలల్లోనే ఉంటాయి.
ఆ మున్సిపాలిటీల్లో..
జిల్లా కేంద్రం వికారాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలోని ఎన్టీఆర్, బీజేఆర్ చౌరస్తాల్లో రద్దీ విపరీతంగా పెరిగి పోయింది. రామయ్యగూడ మార్గంలో.. ఆలంపల్లి రోడ్డులోని పెట్రోల్ బంక్ చౌరస్తాలో, మహాశక్తి థియేటర్ వద్ద, గంగారం చౌరస్తాలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్స్, కళాశాలల విద్యార్థులు పలుచోట్ల రోడ్డు దాటాలంటేనే జంకుతున్నారు. ఎస్‌బీఐ, ఆలంపల్లి తదితర చోట్ల రోడ్ల పక్కనే వ్యాపారాలు సాగిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాండూరు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, చించోలి చౌరస్తా, బస్టాండ్ తదితర చోట్ల ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. పరిగి బస్టాండ్, అంబేడ్కర్, వివేకానంద, బాహర్‌పేట, కొడంగల్ చౌరస్తాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. మున్సిపల్ కేంద్రాల్లో పార్కింగ్ స్థలాలు లేకపోవటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో రోడ్ల పక్కనే నిలపాల్సి వస్తోందని అంటున్నారు. పార్కింగ్ స్థలాల కేటాయింపులో నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మాత్రం వేలకు వేలు చలానాలు బాదుతున్నారని వాహనదారులు వాపోతున్నారు.
అర్జీలు బుట్టదాఖలు
ట్రాఫిక్ సమస్యకు అనేక కారణాలని పోలీసులు పేర్కొంటున్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు పట్టణాల్లోకి భారీ వాహనాలు రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే బైపాస్ లేదా రింగ్ రోడ్డు వేయాలంటున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం దశాబ్ద కాలంగా పోలీసు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం కనిపించడం లేదు. మరో పక్క హైదరాబాద్ – బీజాపూర్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో మన్నెగూడ, కొడంగల్ సమీపంలో రెండు చోట్ల హైవే పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సిబ్బందిని నియమించకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి. జిల్లాకు మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇవి మంజూరైతే ఒక్కో స్టేషన్‌కు ట్రాఫిక్ సీఐ, ఎస్‌ఐలతో పాటు 25 మంది పోలీసులను కేటాయిస్తారు. దీంతో సమస్య చాలా వరకు పరిష్కారమైనట్లే.
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు లేవు. సిబ్బందిని కూడా కేటాయించలేదు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కొంత ఇబ్బందిగా మారింది. అయినా సమస్య లేకుండా చూస్తున్నాం. వికారాబాద్, తాండూరు, పరిగి పట్టణాల్లో ట్రాఫిక్ ఠాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రావాల్సి ఉంది. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి.
– నారాయణరెడ్డి, ఎస్పీ