
నూతన ఆవిష్కరణలతో సత్తా చాటండి
అనంతగిరి: విద్యార్థులను సాంకేతిక రంగంపై అడుగులు వేయించడమే లక్ష్యంగా రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్‌ఐఏ కార్యక్రమం విజయవంతమైందన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని సంగం లక్ష్మీబాయి బాలికలు ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలోని ఐదు పాఠశాలల్లో రోబోటిక్స్ వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 568 మంది విద్యార్థులు (453 మంది బాలికలు, 115 మంది బాలురు) పాల్గొన్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో ప్రతి స్కూల్‌కి రోబోటిక్స్ కిట్లు అందుతాయని, వాటితో నూతన ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సోహం అకాడమీ వ్యవస్థాపకులు కొమరగిరి సహదేవ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జేశ్వంత్, పాఠశాల ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
కలెక్టర్ ప్రతీక్‌జైన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్ తోపాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్‌కట్ చేశారు. డీఆర్‌ఓ మంగీలాల్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.