
పొలాలు పోతే బతికేదెట్లా?
కొందుర్గు: ‘అభివృద్ధి పనుల పేరిట చేపట్టనున్న రోడ్డు నిర్మాణం.. నేల తల్లిని నమ్ముకున్న మాకు శాపంగా మారింది. జీవనోపాధి కోల్పోతాం. రోడ్డున పడతాం’ అని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డును కలిపేందుకు నిర్మించతలపెట్టిన రేడియల్ రోడ్డుకు ఓ వైపు ఆర్‌వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ.. శుక్రవారం సర్వే పనులు చేస్తుండగా.. సమీపాన సాగుభూములు కలిగిన కర్షకులు.. ఆందోళన చెందారు. పొలాలు పోతే బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమ పొలాల నుంచి రోడ్డు వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ అజాంఅలీ ఖాన్‌ను వివరణ కోరగా.. రోడ్డు మార్కింగ్ చేస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.
మూడు ప్రతిపాదనలు సిద్ధం
సర్వే పనులు మొదలు పెట్టిన కన్సల్టెన్సీ ప్రతినిధు లు మాట్లాడుతూ..షాబాద్ మండల కేంద్రం మీదు గా చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల నుంచి పరిగి మండలం గూడూరు వరకు 55 కిలో మీటర్ల వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అయితే ఈ రహదారికి సంబంధించి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వం ఏదైనా ఒక దానిని ఆమోదం తెలపవచ్చన్నారు.