
గొల్లచెరువు కబ్జాలపై చర్యలేవి?
తాండూరు టౌన్: తాండూరు పట్టణ పరిధిలోని గొల్ల చెరువు(మినీ ట్యాంక్‌బండ్) సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు రూ.12 కోట్లతో గొల్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా సుందరీకరిస్తామని చెప్పి మాట తప్పాయన్నారు. మంజూరైన నిధులు ఏమేరకు ఖర్చు చేశారో, ఇంకా ఏఏ పనులు చేయాల్సి ఉందో చెప్పాలన్నారు. చెరువు కట్ట పరిస్థితి అధ్వానంగా తయారయ్యిందని, వాకింగ్ ట్రాక్ పూర్తిగా పాడైపోయిందన్నారు. చెరువులో గుర్రపు డెక్క మొక్కలు విపరీతంగా పెరిగాయన్నారు. సుమారు 11 ఎకరాల చెరువు శిఖం ఆక్రమణలకు గురైందని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చినా కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ఆరోపించారు.వెంటనే స్పందించి చెరువు కట్ట నిర్మాణం, లైటింగ్ వ్యవస్థ, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులను పూర్తి చేసి, మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రాజు, ప్రకాష్, దోమ కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.