
బస్సు సర్వీసులు పెంచాలి
ధారూరు: అదనపు బస్సు సర్వీసులు వేయాలని మండల పరిధిలోని తరిగోపుల గ్రామస్తులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గురువారం గ్రామంలోని చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. దాదాపు వంద మంది విద్యార్థులు వికారాబాద్‌కు రోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లివస్తుంటారని, ఉదయం, సాయంత్రం ఒకే ట్రిప్పు నడిపించడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని యువకులు, తల్లిదండ్రులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ నుంచి తరిగోపుల గ్రామానికి వచ్చిన బస్సును తిరిగి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఉదయం 7:30 గంటలకు, 8:30 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు, 5:30 గంటలకు రెండు ట్రిప్పుల చొప్పున నడపాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఒక సర్వీసు నడపాలని కోరారు. ఇటీవల మేకలగండి రోడ్డులో బస్సు అదుపుతప్పి తృటిలో ప్రమాదం తప్పిందని గుర్తు చేశారు. 40 మంది కూర్చోవాల్సిన బస్సులో వంద మందికి పైగా ఎక్కువతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ఇబ్బందులు తీర్చాలని కోరారు. విషయం తెలుసుకున్న ధారూరు పోలీసులు గ్రామానికి చేరుకుని యువతకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేరు. మొండికేసిన యువకులను బలవంతంగా అదే బస్సులో ఎక్కించారు. గ్రామస్తులకు, తల్లిదండ్రులకు నచ్చజెప్పి, డిపో మేనేజర్‌తో మాట్లాడించి ధర్నాను విరమింపజేశారు.
సమయపాలన పాటించాలి
బంట్వారం: కళాశాల సమయానికి ఆర్టీసీ బస్సు నడపాలని కోట్‌పల్లి మండలంలోని బార్వాద్ విద్యార్థులు శుక్రవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వికారాబాద్ నుంచి బార్వాద్ బస్సు ఉదయం 7:30కు రావాల్సి ఉంటుందన్నారు. కొన్ని రోజులుగా సమయానికి రాకపోవడంతో కళాశాలకు వెళ్లడం ఆలస్యమవుతుందన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బార్వాద్ బస్సును సమయానికి నడిపించాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి విద్యార్థులకు మద్దతు తెలిపి ధర్నాలో కూర్చున్నారు. ఈ విషయంపై వికారాబాద్ డీఎం వెంటనే స్పందించారు. విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. రోడ్డు బాగోలేకపోవడంతో రెండు రోజులుగా కొంత ఆలస్యమైందన్నారు. సమయానికి నడిపించేలా చర్యలు చేపడుతామన్నారు.
తరిగోపుల చౌరస్తాలో
విద్యార్థులు, గ్రామస్తల ధర్నా