
రోగులకు మెరుగైన వైద్యం అందాలి
జిల్లా వైద్యాధికారి లలితాదేవి
తాండూరు టౌన్: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి సిబ్బందిని ఆదేశించారు. నూతనంగా జిల్లా డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆమె తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆస్పత్రి, బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్‌లను పరిశీలించారు. ఆయా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాండూరులోని ఆస్పత్రుల్లో ఉత్తమ వెద్య సేవలందిస్తున్నారన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కాన్పు కోసం ఎంసీహెచ్‌కు వస్తున్నారన్నారు. నెలవారీ ప్రసూతి కేసుల సంఖ్య మెరుగ్గా ఉందన్నారు. ఎంసీహెచ్‌లోని ఎన్‌ఆర్సీ, డైస్ సెంటర్లలో చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడం, స్పీచ్ థెరఫి, ఫిజియోథెరఫి, కౌన్సెలింగ్ సేవలు భేషుగ్గా కొనసాగుతున్నాయన్నారు. డీఎంహెచ్‌ఓతో పాటు డిప్యూటీ డిఎంహెచ్‌ఓ రవీందర్‌యాదవ్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.