
నిల్వ ఘనం.. వినియోగం దైన్యం!
తాండూరు: వానాకాలం సాగు ఈసారి రైతులకు కలిసి రావడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్ని సమృద్ధిగా ఉన్నా సరిపడా వానలు మాత్రం కురవడం లేదు. పక్షం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. భూమిలో తేమ లేని సమయంలో పంట పొలాలకు ఎరువులను వేయడంతో నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో 5.63 లక్షల ఎకరాలలో కంది, పత్తి, వరి, సోయా, పెసర, మినుములతో పాటు తదితర పంటలు సాగవుతున్నాయి. అయితే ఇప్పటికే 70 శాతం వరకు కర్షకులు తమ భూముల్లో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పంటలు కలుపు దశకు వచ్చాయి. అయితే పంట మొక్కల్లో సత్తువ కోసం డీఏపీ, యూరియా, పొటాష్ లాంటి ఎరువులను పైపాటుగా రైతులు పట్టిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేసుకొని పంటలకు సైతం వేశారు. అయితే భూమిలో తేమ లేకుండా ఎరువులను వాడితే పంటలకు నష్టం సంభవిస్తోందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ దశలో వర్షం కోసం ఆకాశం వైపు దిగాలుగా చూడసాగారు.
12 మండలాల్లో వర్షాభావం
జిల్లాలో 12 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయాధికారులు ధ్రువీకరించారు. జిల్లాలోని పరిగి, బొంరాస్‌పేట, ధారూరు, కోట్‌పల్లి, యాలాల, దౌల్తాబాద్, చౌడాపూర్, దుద్యాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 12 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. దీంతో మరో వారం రోజుల పాటు వర్షాలు కురవకపోతే రెడ్ జోన్ పరిధిలో వర్షపాతం నమోదవుతోందని వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో ఎరువులు
సకాలంలో రైతులకు ఎరువులను అందించేందుకు ప్రభుత్వం హోల్‌సేల్, రిటైల్, సొసైటీలు, మార్క్‌ఫెడ్ సంస్థలకు ఎరువుల పంపిణీకి అనుమతులు ఇచ్చింది. దీంతో ఇప్పటికే వేల మెట్రిక్ టన్నులను రైతులకు సరఫరా చేశారు. తాజాగా మార్కెట్‌లో యూరియా 6,942.331 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,829 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 131 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 189 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 4,372.360 మెట్రిక్ టన్నులు చొప్పున అందుబాటులో ఉన్నాయి.
వర్షాలు కురవాలి
రైతులు పండిస్తున్న పంటలకు డీఏపీ, యూరియా లాంటి ఎరువులను జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. అయితే పక్షం రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు కురవడం లేదు. తేలికపాటి నేలల్లో తేమ లేకపోతే ఎరువులను వాడితే అనర్థాలు సంభవిస్తాయి. వర్షాలు లేని సమయంలో పైపాటు ఎరువులను పంటలకు పట్టించడంతో నష్టం జరుగుతోంది.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయాధికారి
ఎరువుల వాడకంపై సందిగ్ధం
వర్షాభావ పరిస్థితులతో
వినియోగానికి అడ్డంకి
దిగుబడి తగ్గుతుందని
ఆందోళనలో రైతులు