
సీటు కోసం వేసిన పర్సు, ఫోన్ మాయం!
తాండూరు టౌన్: ఆర్టీసీ బస్సులో సీటు ఆపుకొనేందుకు వేసిన పర్సు, సెల్‌ఫోన్ పోయాయంటూ ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేసింది. తన వస్తువులు ఇచ్చే వరకూ బస్సును కదలనిచ్చేది లేదంటూ అడ్డుగా నిలబడింది. ఈ ఘటన తాండూరులో గురువారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలానికి చెందిన ఓ మహిళ తాండూరు బస్టాండుకు వచ్చి ఓగిపూర్ వెళ్లే బస్సులో సీటు కోసం కిటికీలో నుంచి తన పర్సు, సెల్‌ఫోన్ వేసింది. లోపలికి వెళ్లి చూసే సరికి అవి కనపడలేదు. దీంతో ప్రయాణికులు ఎవరో తీసి ఉంటారని, వెంటనే ఇచ్చేయాలని కోరింది. ఎవరూ స్పందించకపోవడంతో ఇందిరాచౌక్‌లో బస్సుకు అడ్డంగా నిలబడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రయాణికులను విచారించినా తామెవరమూ తీయలేదని చెప్పారు. దీంతో బాధిత మహిళకు నచ్చజెప్పిన పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వమని సూచించారు.