
జల్సాల కోసం.. ఆటోల చోరీ
శంకర్‌పల్లి: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బుల కోసం ఆటోల చోరీకి పాల్పడి కటకటాల పాలయ్యాడు. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌కి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఆటో ఈనెల 14న కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్ముర తనిఖీలు చేపట్టారు. గురువారం చేవెళ్ల మండల ఎన్కేపల్లి వద్ద తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడికి అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామానికి చెందిన దుర్గంచెరువు రాజేంద్రప్రసాద్(25)గా గుర్తించారు. ఈ నిందితుడిపై గతంలో వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, సదాశివపేట, పరిగి తదితర పోలీస్‌స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి. నిందితుడు పది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై, మళ్లీ ఆటో దొంగతనం చేసి దొరకడం గమనార్హం.