
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
దౌల్తాబాద్: రైతు సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాలను అమలు చేస్తుంది. పీఎం కిసాన్, పంటల బీమా తదితర పథకాలను ఇందుకు ఉదహరణగా చెప్పవచ్చు. ఈ పథకాలను సవ్యంగా రైతులకు చేరేలా కేంద్రం ఆధార్‌కార్డు మాదిరిగా 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డులను అందజేయనుంది. ఈ ప్రక్రియ మే నెలలోనే ప్రారంభమై ఇంకా కొనసాగుతుంది. మండలంలో ప్రధానంగా ఈ ప్రక్రియను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహిస్తున్నారు. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విశిష్ట సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు అనుసంధానం చేస్తూ దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ విశిష్ట సంఖ్యకు సంబంధం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 19,241 మంది పట్టాదారులు ఉండగా ఇప్పటివరకు 5,883 మంది రైతుల గుర్తింపు కార్డులను నమోదు చేశారు. ఇంకా 70శాతం మంది రైతులు మిగిలి ఉన్నట్లు ఏఓ లావణ్య తెలిపారు.
సాంకేతిక సమస్యలు
మండలంలో విశిష్ట కార్డుల ప్రక్రియ గురించి మండలంలో 9 క్లస్టర్లలో వ్యవసాయ అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ అన్నదాతలు ఆసక్తి చూపడంలేదు. ఈ ప్రక్రియ నిర్వహణలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కార్డుల వల్ల ప్రయోజనాలను రైతులు గుర్తించి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. గురువారం దౌల్తాబాద్‌లో ఏఈఓ వైశాలి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ చేపట్టారు. అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నమోదు ప్రక్రియ నిర్వహించారు.
రైతులు విశిష్ట ప్రయోజనాలు పొందాలి
వ్యవసాయ అధికారుల సూచన