
సిట్ విచారణకు ఏఎంసీ చైర్మన్
తాండూరు టౌన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో బాల్‌రెడ్డికి చెందిన ఫోన్ నంబర్‌ను ట్యాపింగ్ చేశారని, అట్టి ఫోన్ నంబర్ తనకు చెందినదేనా లేదా అనే విషయమై వివరణాత్మక వాంగ్మూలాన్ని ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులో కోరారు. దీంతో సిట్ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు బాల్‌రెడ్డి తెలిపారు.
గోపన్‌పల్లిలో
డెంగీ కేసు నమోదు
తాండూరు రూరల్: మండల పరిధిలోని గౌతాపూర్ అనుబంధ గ్రామం గోపన్‌పల్లిలో డెంగీ కేసు నమోదైంది. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అబూబాకర్ 9వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా డెంగీగా నిర్ధారించారు. దీంతో జినుగుర్తి ఆస్పత్రి సిబ్బంది గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. స్థానికంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.