
వరుణుడా.. కరుణించవా!
ధారూరు: వానాకాలం పంటల సాగులో భాగంగా కంది, పెసర, మినుము, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను మండల వ్యాప్తంగా కర్షకులు సాగుచేశారు. ఎదుగుతున్న మొక్కలకు వరుణుడి కరుణ లేకపోవడంతో వాడిపోతున్నాయి. సకాలంలో సరైన వానలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలకు వేలు వ్యయం చేసి వేసిన పంటలన్నీ మొలకెత్తే దశలో ఉన్నాయి. కానీ సరిపడా వర్షాలు లేక వాటి ఎదుగుదల మందగించింది. మండలంలో దాదాపు 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. నిత్యం వరుణుని కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. మేఘాలు కమ్ముకున్న వాన పడకపోవడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. అవసరం లేనప్పుడు కుంభవృష్టి, అవసరమున్నప్పుడు అనావృష్టి తాండవిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వానలు కురుస్తేనే తమ మనుగడ సాధ్యమని, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వెంటాడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.