
విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వద్దు
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి ● కలెక్టర్ ప్రతీక్‌జైన్ ● దోమ కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ
దోమ: విద్యార్థుల పట్ల స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎస్సీ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కస్తూర్భాగాంధీ పాఠశాల పరిసరాలు, వంట గది, తరగతి గదులు, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. సౌకర్యాలు బాగున్నాయా? మంచినీరు అందుతోందా..? మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం సరిగ్గా లేకపోవడంతో ఇన్‌చార్జ్ ఎస్‌ఓ గీతాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం ఇలానే ఉంటుందా? అని అసహనం వ్యక్తం చేశారు. వారంలో రెండు సార్లు పాఠశాలను సందర్శించి భోజనం చేయాలని, సరిగ్గా లేకుంటే తమ దృష్టికి తేవాలని ఎంపీడీఓ గ్యామా, ఎంఈఓ వెంకట్‌కు సూచించారు. అనంతరం ఎస్సీ హాస్టల్‌ను సందర్శించి పరిసరాలు, వంట గది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవిందమ్మ, హాస్టల్ వార్డెన్ ప్రవీణ్‌రెడ్డి, డిప్యూ టీ తహసీల్దార్ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాలి
కుల్కచర్ల: విద్యార్థులు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కుల్కచర్లలోని గిరిజన బాలుర వసతి గృహం, కేజీబీవీ, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మొదట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడటంలో కొంత ఇబ్బంది ఉంటుందని రానురాను అలవాటైపోతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంఈఓ అబీబ్ అహ్మద్, ఏపీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.