
పంచాయతీలపై నజర్
బొంరాస్‌పేట: గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్ అన్నారు. తాజాగా మంజూరైన నిధులు, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిర్వహణ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మండలంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన రెండు గిరిజన పంచాయతీలతో కలిపి మొత్తం 35 పంచాయతీలుండగా 32 మంది కార్యదర్శులున్నారు. మండలంలో కొనసాగుతున్న పంచాయతీరాజ్ శాఖ పనుల గురించి సోమవారం ఆయన ‘సాక్షి’కి వివరించారు.
మంజూరైన నిధులు
ప్రతీ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వరదనీరు వెళ్లే ప్రధాన కాల్వ చివరి భాగంలో ఇంకుడు గుంతలు నిర్మాణం, 322 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఈజీఎస్ నిధుల్లోనే ప్రత్యేకంగా రూ.12వేల చొప్పున మంజూరయ్యాయన్నారు. మండల కేంద్రంలో వారాంతపు సంత జరిగే ప్రాంతంలో కమ్యూనిటీ షానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.3లక్షలు మంజూరయ్యాయని, స్థల సేకరణకు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. కట్టుకాల్వతండా, పాలబాయితండాలో తడిచెత్త, పొడిచెత్త నిల్వ కోసం రూ.2లక్షలతో షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్
షానిటేషన్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, మురుగు నిల్వ లేకుండా, దోమల నివారణకు చర్యలు, వాటర్‌ట్యాంకుత పరిసరాలను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కుల తొలగింపు, పాఠశాలలు, అంగన్‌వాడీల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అభివృద్ధి పనులు
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, బీటీ, సీసీ రోడ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఎంపీడబ్ల్యూ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులున్నారని, ఒక్కో కార్మికుడికి రూ.9,500 చొప్పున వేతనం అందుతుందని తాజాగా ఏప్రిల్, మే, జూన్ వేతనాల చెక్కులు అందించామన్నారు.
వనమహోత్సవానికి సిద్ధం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మరో వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నాం. ప్రత్యేకంగా బీఐపీ ప్లాంటేషన్ చేపట్టనున్నామని చెప్పారు.
అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విడుదల
ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్

పంచాయతీలపై నజర్