
సారే హాజరు.. విద్యార్థులే లేరు!
కుల్కచర్ల: ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా పలు చోట్ల సర్కారు బడులకు ఆదరణ కరువవుతోంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుస్మసముద్రం పంచాయతీ ఆలుగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకరు ఒకటో తరగతి, మరొకరు రెండో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చేరారు. వీరికి పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ అధికారులు ఓ ఉపాధ్యాయుడిని నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత మూడు రోజులుగా ఆ ఇద్దరు కూడా బడికి రావడం లేదు. దీంతో ఉపాధ్యాయుడు నవీన్‌కుమార్ శుక్రవారం వారి ఇళ్లకు వెళ్లి ఆరా తీయగా పూణెకు వలస వెళ్లిన తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోయారని తెలుసుకుని అవాక్కయ్యాడు. ఇక చేసేదేమీ లేక బడికి వెళ్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విద్యార్థులు లేకపోవడంతో అట్టహాసంగా తెరుచుకున్న బడి మళ్లీ మూతపడే అవకాశముంది.