
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
దోమ: ఇంట్లో వెళ్లిన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గీ మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎదుల మల్లేశం(21) ఈ నెల 9న ఇంట్లో నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై బయలుదేరాడు. అప్పటి నుంచి అతని ఫోన్ నంబర్లు కలవకపోవడం, నగరానికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అతని ఫొటోతో పాటు బైక్ నంబర్‌లను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయగా దోమ మండలంలోని ఊటుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. శుక్రవారం గమనించగా అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొంత కాలంగా మృతుడు నగరంలో స్విగ్గి, రాపిడో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి అక్క శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఊటుపల్లి అటవీ ప్రాంతంలో ఘటన