
నెల రోజులుగా గుడ్డు లేదు!
సర్కారు బడిలో విద్యనభ్యసించే చిన్నారులకు పోషకాహారం అందని ద్రాక్షగా మారింది. వేసవి సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభమైన నాటి నుంచి మధ్యాహ్న భోజనంలో గుడ్డును ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
తాండూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల గండం వేధిస్తోంది. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం వా రంలో మూడు రోజులు గుడ్డు అందజేయాలి. కానీ మండలంలోని చెన్‌గేస్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం(జూన్ 12) నుంచి విద్యార్థులకు ఇప్పటివరకు గుడ్డు ఇవ్వలేదు. దీంతో చిన్నారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ తారాసింగ్ అవాక్కయ్యారు. చెన్‌గేస్‌పూర్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
పెరిగిన గుడ్డు ధర
అనంతరం చిన్నారులతో కలిసి తహసీల్దార్ సహపంక్తి భోజనం చేశారు. శుక్రవారం నాడు అన్నం, పప్పు, వెజిటెబుల్ కర్రి, గుడ్డు పెట్టాలని మెనూలో ఉంది. కానీ ఆ నిబంధనను అమలు చేయలేదు. దీంతో విద్యార్థులకు ఎందుకు గుడ్డు ఇవ్వలేదని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు. నాలుగు నెలల నుంచి తమకు బిల్లులు రావడం లేదని, అందుకే గుడ్డు పెట్టలేదని మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సావిత్రమ్మ సమాధానమిచ్చారు. ఇప్పటివరకు అప్పు చేసి సరుకులు తెచ్చి వడ్డిస్తున్నామని గోడును విలిబుచ్చారు. రూ.5 ఇవ్వాల్సిన గుడ్డును, రూ.6 ఇస్తున్నారని వాపోయారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఆయన వెంట హెచ్‌ఎం శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ బాబు, రికార్డు అసిస్టెంట్ ఉలేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీకి వెళ్లి అవాకై ్కన తహసీల్దార్
నాలుగు నెలల నుంచి బిల్లులు రాలేదన్న నిర్వాహకులు
అన్నం, పప్పుతో సర్దుకుంటున్న విద్యార్థులు