
డీహెచ్‌కు సెలవు!
● త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు? ● తాండూరు నర్సింగ్ కళాశాల భవనంలో కొడంగల్ మెడికల్ కాలేజీ ● ఇప్పటికే వర్చువల్‌గా పరిశీలించిన కేంద్ర బృందం
తాండూరు: తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఇక జనరల్ ఆస్పత్రిగా మారనుంది. ఇందుకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. నేడో.. రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. 23 ఏళ్లుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఆధీనంలో ఉమ్మడి జిల్లాలో సేవలందించిన ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఏ) ఆధీనంలోకి వెళ్లనుంది. వీవీపీ వైద్యులు, సిబ్బంది రానున్న రోజుల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లే అవకాశాలున్నాయి. జనరల్ ఆసుపత్రిగా మారితే వైద్య సేవలు సక్రమంగా అందుతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
200 పడకలకు అప్‌గ్రేడ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన తాండూరులో ఉమ్మడి జిల్లా ప్రభుత్వాస్పత్రి ఏర్పాటుకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 2002 ఆగస్టు 1న తాండూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రారంభించారు. వంద పడకలతో ప్రారంభించి రోగుల సంఖ్య పెరగడంతో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ ప్రతీ రోజు 800 వరకు ఓపీతో పాటు 180 మంది వరకు ఇన్‌పేషెంట్‌లకు వైద్య సేవలు అందుతున్నాయి.
బోర్డులు మార్చి అనుమతులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొడంగల్ పట్టణ శివారులో కాలేజీ భవన నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. కళాశాల ఏర్పాటుకు 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి తప్పనిసరి. కానీ కొడంగల్‌లో పీహెచ్‌సీ మాత్రమే ఉండడంతో అనుమతులు సాధ్యపడలేదు. దీంతో తాండూరు జిల్లా ఆస్పత్రి బోర్డు తొలగించి కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా బోర్డులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు బోర్డులు తొలగించి నిరసన వ్యక్తం చేశాయి.
చురుగ్గా భవన నిర్మాణ పనులు
తాండూరు శివారులో నర్సింగ్ కళాశాల భవనంలోనే కొడంగల్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రితో పాటు, ఎంసీహెచ్ ఆస్పత్రుల్లో 350 పడకలు అందుబాటులో ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభు త్వం నుంచి సులువుగా మెడికల్ కళాశాల అనుమతులు తీసుకురావొచ్చనే యోచనతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. నాలుగు రోజుల క్రితమే కేంద్ర బృందం మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను వర్చువల్‌గా పరిశీలించింది.
టీవీవీపీ ఉద్యోగుల్లో ఆందోళన
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇతర జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు సమయంలో టీవీవీపీ ఆధీనంలో పని చేసిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో ఇక్కడ సైతం బదిలీలు తప్పవనే ఆందోళనలో ఉద్యోగులున్నారు. ఇక్కడి ఉద్యోగులను డీఎంఏ పరిధిలోకి విలీనం చేసి వైద్య సేవలను పొందాలనే డిమాండ్ సైతం పెరుగుతోంది. లేదా జిల్లా ప్రభుత్వ, జనరల్ ఆసుపత్రిలో నియమించే ఉద్యోగులను ఒకే గొడు గు కిందకు తీసుకురావాలని వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు.
తాండూరు జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు
అదనపు వైద్య సేవలు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్‌లు డీఎంఏలోకి మారనున్నాయి. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే అదనపు వైద్య సేవలు అందుతాయి. రెండు ఆస్పత్రుల్లో 200 మంది వైద్యుల సేవలు అవసరం ఉంటుంది.
– డాక్టర్ ఆనంద్, డీసీహెచ్‌ఎస్, వికారాబాద్

డీహెచ్‌కు సెలవు!

డీహెచ్‌కు సెలవు!