
ఎనికేపల్లిలో ఉద్రిక్తత
● గోశాల పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ ● పరిహారం తేల్చకుండా ఎలా చేస్తారని చుట్టుముట్టిన రైతులు ● పనులు చేపట్టేందుకు వెళ్లిన జేసీబీని అడ్డుకున్న వైనం ● లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఇద్దరికి స్వల్ప గాయాలు
మొయినాబాద్: గోశాలకు కేటాయించిన ఎనికేపల్లి భూముల వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 7.30 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్ భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. గోశాల ఏర్పాటుకోసం భూమి పూజ చేశారు. అంతలోనే రైతులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. పరిహారం విషయం తేల్చకుండా పనులు ఎలా మొదలు పెడతారని నిలదీశారు. పరిస్థితి చేజారి పోతుందని గమనించిన పోలీసులు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యేను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు.
తప్పుదోవ పట్టించారు
అధికారులు, పోలీసులు తమను తప్పుదోవ పట్టించారని రైతులు ఆరోపించారు. ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడతారని అధికారులు సమాచారం ఇచ్చారని, కానీ 7.30 గంటలకే వచ్చి భూమి పూజ చేశారన్నారు. గ్రామం నుంచి భూముల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే భూమి పూజ పూర్తయిన తరువాత పంపారన్నారు.
లాఠీ ఝలిపించిన పోలీసులు
ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయిన తరువాత రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భూములను చదును చేసేందుకు జేసీబీ అక్కడికి రాగా రైతులంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ చెయ్యికి గాయాలుకాగా, మరొకరికి వీపులో వాతలు వచ్చాయి. రైతులు రాత్రి వరకు అక్కడే బైఠాయించారు.
ఖాళీ భూములు ఇవ్వాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసే గోశాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌రత్నం అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. మండలంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, రైతులు సాగుచేసుకొనే భూములను తీసుకోవడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని ఈ నెల 13న కలసి మాట్లాడటానికి సమయం తీసుకున్నారని.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు భీమేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎనికేపల్లిలో ఉద్రిక్తత