
ఫార్మా రైతులకు ప్లాట్లు
కందుకూరు: వంద శాతం హక్కులతో పారదర్శకంగా ప్రభుత్వం ఫార్మా రైతులకు ప్లాట్లను అందజేస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవు ట్‌లో సోమవారం కందుకూరు, యాచారం మండలాల భూ నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులు 670 మందికి ప్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో ప్రభుత్వమే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు.
రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సబితారెడ్డి
లాటరీ ప్రారంభానికి కంటే ముందే స్థానిక ఎమ్మె ల్యే సబితారెడ్డి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తొందరపడి ఎవరూ ప్లాట్లు విక్రయించొద్దని, భవిష్యత్‌లో మంచి లాభం వస్తుందని సూచించారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించిందని, దీంతో ఈ ప్రాంతం నాశనమయ్యేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉండేలా ఫ్యూచర్‌సిటీని ప్రకటించారన్నారు. రైతుల భూముల విలువలు మరింత పెరుగుతాయని, భవిష్యత్‌లో గజం ధర రూ.లక్ష పలుకుతుందన్నారు.
పర్యవేక్షించిన అధికారులు
మొదటి రోజు కుర్మిద్ద, మేడిపల్లి, మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల, నానక్‌నగర్, పంజగూడ, తాటిపర్తి రెవెన్యూ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 60 గజాల చొప్పున ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఎఫ్‌సీఏడీఏ కమిషనర్ శశాంక, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు తదితరులు లాటరీ ప్రక్రియను పర్యవేక్షించారు.
లాటరీ ద్వారా కేటాయింపు షురూ
మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులకు..
ప్రక్రియను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి