
సర్వం లీకేజీలమయం
తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ పరిధిలో 36 వార్డుల్లో 14,706 గృహాలు, 85వేల జనాభా ఉంది. వీరికి రోజుకు 12 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా 9 ఎంఎల్‌డీల నీటి మాత్రమే సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలను మిషన్ భగీరథ, కృష్ణా జలాలు, కాగ్నానది వద్ద గల రెండు పంప్‌హౌస్ తీరుస్తున్నాయి. పట్టణ పరిధిలో 14,706 ఇళ్లు ఉండగా 7,158 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు సరఫరా చేయడం లేదు. 10 వాటర్ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఆరేళ్ల క్రితం తాండూరు మున్సిపాలిటీలో ఎన్‌టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, రసూల్‌పూర, కోకట్ రోడ్డు, గౌతాపూర్ శివారు ప్రాంతాలు కలిశాయి. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంది లేదు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇళ్లకు పైప్‌లైన్ వేసి ట్యాప్‌లు బిగించలేదు. దీంతో ట్యాంక్ అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. 325 వరకు బోరు మోటార్లు, పంపులు ఉన్నా సగానికి పైగా కబ్జా చేసి వాడుకుంటున్నారు. 122 చేతిపంపులు ఉండగా కొన్ని మరమ్మతులకు నోచుకోవడం లేదు. పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తున్న కాగ్నా నదిలోని పంప్‌హౌస్‌లు పాడయ్యే స్థితికి చేరాయి. పాత తాండూరులోని పంప్ హౌస్ పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు వృథాగా పోతోంది.