అంతా ఆన్‌లైన్‌! | - | Sakshi
Sakshi News home page

అంతా ఆన్‌లైన్‌!

Jul 1 2025 7:29 AM | Updated on Jul 1 2025 7:29 AM

అంతా ఆన్‌లైన్‌!

అంతా ఆన్‌లైన్‌!

నేటి నుంచి

వికారాబాద్‌: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ సిస్టం అమలు చేయనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విధులకు హాజరుకావటంలో పారదర్శకతకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపుతుండగా అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని అన్ని శాఖల హెచ్‌ఓడీ కార్యాలయాల నుంచే ఈ విధానం మొదలు పెట్టనున్నారు. కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలు కానుంది. అనంతరం ఆరోగ్య, విద్యాశాఖల్లో సైతం ఏర్పాటుకు నిర్ణయించారు. హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జిల్లాలో 24 పీహెచ్‌సీలు ఉండగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. విద్యాశాఖ పరిధిలో 1,063 పాఠశాలలు ఉండగా ముందుగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎన్నెపల్లి పాఠశాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. వారం రోజుల్లో ఎంప్లాయి ఐడీలతో పాటు వారి ఆధార్‌ నంబర్‌లు సేకరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మొత్తం 6,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

పర్యవేక్షణ ఉంటేనే ఫలితం

గత కలెక్టర్‌ నారాయణరెడ్డి హయాంలో జిల్లాలో మొదటిసారి జీఓ అటెండెన్స్‌ పేరుతో ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలు చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోయాక బయోమెట్రిక్‌, ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ విధానానికి స్వస్తి పలికారు. విధి నిర్వహణ, రోజువారీ హాజరులో పారదర్శకత కొరవడిన విషయం గమనించిన ప్రస్తుత కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తిరిగి ఆన్‌లైన్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలు చేయనున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నెల వారీ పర్యవేక్షణ ఉంటేనే సక్సెస్‌ అవుతుందని అంచనా వేశారు. గతంలో ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు...? ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు...? వారిని గుర్తించి.. శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆన్‌లైన్‌ హాజరును ఉద్యోగులు లైట్‌ తీసుకున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటగా

యంత్రాంగంలో ఎక్కువ మంది ఉద్యోగులతో నడిచే వైద్య, విద్యా శాఖల్లో ఐదారు ఏళ్ల క్రితమే బయోమెట్రిక్‌ విధానం అమలు చేశారు. రోజువారీ హాజరు పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పాఠశాలల్లో మార్పును ఆశించి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ విధానం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఇప్పటికే కళాశాలలు, గురుకుల పాఠశాలలు తదితర సంస్థలోల బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. సర్కారు 2018లో ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ముందుగా 10 జిల్లాలను తీసుకోగా అందులో వికారాబాద్‌ జిల్లా కూడా ఉంది. ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతం కావటంతో ఆరు నెలల తరువాత ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగు పడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులకే చిన్న చిన్న సాకుగా చూపి బయోమెట్రిక్‌ మిషన్లు మూలన పడేశారు.

బయోమెట్రిక్‌తో అధికారుల హాజరు నమోదు

పారదర్శకత కోసం ప్రత్యేక కార్యాచరణ

ముందుగా కలెక్టరేట్‌లో అమలు

వైద్య, విద్యా శాఖల్లోనూ

పైలెట్‌ ప్రాజెక్టు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement