
త్వరలో మెడికల్ కళాశాల తరగతులు
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలో త్వరలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో రూ.26 కోట్లతో చేపట్టిన(నిర్మాణ దశలో ఉన్న) భవనాన్ని ఆయన పరిశీలించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతుల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు, వసతులు, గదులు, ల్యాబ్‌లు, హాస్టల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందని ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మెడికల్ కళాశాలల కోసం నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. పూర్తి వివరాలను ఈనెల 30న ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు. తాండూరు, కొడంగల్‌లో భవన నిర్మాణ పనులు ఏమేరకు పూర్తయ్యాయనే విషయమై పరిశీలనకు వచ్చామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తాండూరులో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 56 మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న తాండూ రు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తత పరచనున్నట్లు వివరించారు. సిటి స్కాన్ నుంచి ఎంఆర్‌ఐ వరకు అధునాతన టెక్నాలజీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
కొడంగల్ కళాశాల తాండూరులో..
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాల తరగతులను తాండూరులో ఎందుకు కొనసాగించనున్నారని విలేకరులు కమిషనర్‌ను ప్రశ్నించగా, దీనికి ఆయన ఇలా సమాధానమిచ్చారు. మెడికల్ కళాశాల కొడంగల్‌కు మంజూరైన విషయం తెలిసిందేనని, అయితే తాండూరులో నర్సింగ్ కళాశాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని మెడికల్ కళాశాల కోసం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు చెప్పారు. నర్సింగ్ విద్యార్థినుల కోసం అవసరమైతే మరో చోట భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం కమిషనర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు. ఆయన వెంట టీజీఎంఐడీసీ ఎస్‌ఈ సురేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనందం, ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ సునీత, డాక్టర్ వినయ్‌కుమార్ ఉన్నారు.
పనుల్లో వేగం పెంచండి
కొడంగల్: కొడంగల్ పట్టణంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, నాణ్యతలో రాజీ పడరాదని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, డాక్టర్లు సాకేత్, శివశంకర్, పూజ, శ్రావణి, వైద సిబ్బంది మోహన్, గీత, సంగీత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
తాండూరు పట్టణంలో భవనం పరిశీలన