పరిషత్తు.. కసరత్తు
● పార్టీ గుర్తుపై ఎలక్షన్‌కు వెళ్లేందుకే ప్రభుత్వం మొగ్గు ● జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
వికారాబాద్: మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో అన్నింటికంటే ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం జీపీలకు బదులుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో పార్టీ గుర్తుతో నిర్వహించే ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 సెన్సెస్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలనే దానిపై అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండలాల నుంచి మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను పరిగణలోకి తీసుకొనిమండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయించారు. కొత్త గా ఏర్పాటు చేసిన మండలాల్లో సెతం ఎంత మంది ఎంపీటీసీలు ఉండలానే విషయంలోనూ కసరత్తు పూర్తి చేశారు. ఈ లెక్కలు ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందజేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ‘ప్రత్యేక’ పాలన
గ్రామ పంచాయతీల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు సైతం పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. జిల్లాలో మొత్తం 221 మంది ఎంపీటీసీలు ఉండగా వారి పదవీ కాలం గతేడాది జూలైలోనే ముగిసింది. ఇక జెడ్పీటీసీలు 18 మంది ఉండగా వారి పదవీ కాలం కూడా అదే నెలలో ఒక్కరోజు తేడాతో ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీ కాలం సైతం ముగిసిన విషయం తెలిసిందే. జీపీలు, మండల, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేకాధికారులు కొనసాగుతున్నారు. గతంలో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశాంచింది. ఓటరు జాబితాసిద్ధ చేయాలని, బీసీ కమిషన్ నివేదికతో రెడీగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. దాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. దీంతో అందరి దృష్టి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
పెరిగిన స్థానాలు
జిల్లాలో 2019 మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మండల పరిషత్, ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల 18 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించగా కొత్త గా ఏర్పాటైన చౌడాపూర్, దుద్యాల్ మండలకు ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మండల పరిషత్‌ల సంఖ్య 20కి చేరింది. గతంలో 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం వీటి సంఖ్య ఆరు పెరిగి 227కు చేరింది. మన జిల్లా పరిధిలోని బొంరాస్‌పేట్, నారాయణపేట్ జిల్లా పరిధిలోని కోస్గి మండలం నుంచి కొన్ని గ్రామాలను తీసుకుని కొత్త మండలంగా దుద్యాల్‌ను ఏర్పాటు చేశారు. కుల్కచర్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాలు గతంలో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో కలిసిన మరి కొన్ని గ్రామాలతో చౌడాపూర్ మండలాన్ని ఏర్పాటు చేశారు. పరిగి మండలం నుంచి కొన్ని గ్రామాలు పరిగి మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ నవాబుపేట, కోస్గి మండలాల నుంచి కొన్ని గ్రామాలు మన జిల్లాలో కలవడంతో ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. వీటన్నింటికీ ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.


