
ప్రాజెక్టులకు భారీగా నిధులు
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రభు త్వం రూ. 97.30 కోట్లు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్‌పల్లి ప్రాజెక్టు కింద పెద్దేముల్ మండల పరిధిలోని 14 గ్రామ పంచాయితీల్లోని 9,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.89.30 కోట్లతో మర్మమతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే 4,500 ఎకరాల ఆయకట్టు ఉన్న జుంటుపల్లి ప్రాజెక్టుకు రూ. 8 కోట్లతో మరమ్మతు చేపట్టనున్నామన్నారు. కాలువల నిర్మాణం, తూములు మరమ్మతు తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అలాగే తాండూరు పట్టణంలోని చిలకవాగు కాలువ, గొల్ల చెరువు సుందరీకరణ పనులను కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు. కొడంగల్ రోడ్డు మార్గం నుంచి గౌతాపూర్ వరకు, బస్టాండ్ నుంచి గౌతాపూర్ వరకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి గాను రూ.200 కోట్లతో మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణానికి కాగ్నా నది నుంచి తాగునీటి సరఫరా నిమిత్తం నూతన పైపులైన్, మోటార్లను రూ.54 కోట్లతో పూర్తి చేయనున్నామన్నారు. పట్టణ శివారులో 30 ఎకరాల్లో రూ.40 కోట్లతో మార్కెట్ యార్డును నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.200 కోట్లతో దౌలాపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు సీఎం చేత వచ్చే నెలలో శంకుస్థాపన చేయించనున్నామని వివరించారు. ఐటీఐకి బదులుగా టాటా కన్సల్టెన్సీ సహకారంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 3,500 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ యువ వికాస్ కింద 5వేల మందికి వచ్చే నెల 2వ తేదీ న రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోట్‌పల్లి, జుంటుపల్లి జలాశయాల మరమ్మతులకు రూ.97.30 కోట్లు మంజూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి