
పవర్
మరింతగా..
ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా శరవేగంగా విస్తరిస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రమిక విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,756 మెగావాట్లు నమోదు కాగా, 2025లో 4,352 మెగావాట్లకు చేరుకుంది. అదే 2030 నాటికి అనూహ్యంగా 9,089 మెగావాట్లకు పెరుగుతుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు విద్యుత్ లైన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు 62 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. మరో ఐదేళ్లలో ఇది 80 లక్షలు దాటే అవకాశం ఉంది. రాబోయే విద్యుత్ డిమాండ్‌ను ఇప్పుడే గుర్తించి, ఆ మేరకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఇళ్లలో 24 గంటలు విద్యుత్ వెలుగులు విరజిమ్మొచ్చొని డిస్కం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 33/11 కేవీ ఫీడర్లు, డీటీఆర్‌లు సామర్థ్యం పెంచుతున్న డిస్కం.. తాజాగా మరికొన్ని అదనపు సబ్‌స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే రెండేళ్లలో రూ.420 కోట్ల అంచనాతో రంగారెడ్డిజోన్‌లో 34, మెట్రో జోన్‌లో 36, మేడ్చల్ జోన్‌లో 18 చొప్పున మొత్తం 88 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయిచింది. పనుల్లో నాణ్యత, వేగవంతం కోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సర్కిళ్ల వారీగా పనులను విభజించి, వాటికి టెండర్లు పిలిచి, ముందుకు వచ్చే ఔత్సాహిక కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని భావిస్తోంది.
61 సబ్‌స్టేషన్లలో రికార్డు స్థాయి వృద్ధిరేటు
గ్రేటర్ జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 62 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ, 8 లక్షలకుపైగా వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా అదనంగా 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. కొత్త కనెక్షన్లకు తోడు ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్, ఓవెన్, మిక్సీ, వాషింగ్ మిషన్, గ్రీజర్, టీవీ, కంప్యూటర్, ఐరెస్ బాక్స్ సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ వార్షిక పెరుగుదల రేటు ఏటా సగటున 15 నుంచి 25 శాతం పెరుగుతోంది. 61 సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ వృద్ధిరేటు నమోదైంది. 30 నుంచి 87 శాతం వరకు వృద్ధి రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా పెరుగుతున్న ఈ వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇంజనీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా బంజారాహిల్స్, సైబర్‌సిటీ, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, హబ్సిగూడ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో ఇరవై 33/11 కేవీ సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. వీటిలో 184 పీటీఆర్‌ల సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచారు. 33 కేవీఫీడర్లు 69, అదే విధంగా 11 కేవీ ఫీడర్లు 592 ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 6,675 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య లేకుండా చూశారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో డిమాండ్ రానున్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు.
2030 నాటికి గ్రేటర్ డిమాండ్ 9,089 మెగావాట్లు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంచనా
సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, డీటీఆర్‌ల సామర్థ్యం పెంపు
అదనపు సబ్‌స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలు
గ్రేటర్‌లో 2030 నాటికి విద్యుత్ వృద్ధి రేటు
సంవత్సరం మెగావాట్లు
2022 3,158
2023 3,435
2024 3,756
2025 4,352
2026 5,043
2027 5,843
2028 6,770
2029 7,644
2030 9,089