లక్ష్యం.. లక్షల్లో.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. లక్షల్లో..

May 9 2025 8:20 AM | Updated on May 9 2025 8:20 AM

లక్ష్

లక్ష్యం.. లక్షల్లో..

వనమహోత్సవానికి అధికారుల కసరత్తు
● 40,53,500 మొక్కలు నాటేందుకు ప్రణాళిక ● శాఖల వారీగా టార్గెట్‌

వికారాబాద్‌: వనమహోత్సవానికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎప్పటిలాగేఈ సారి కూడా లక్ష్యాలను నిర్దేశించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో అమలు చేస్తోంది. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈ సారికూడా 19 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిసింది. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్షలు చేసి లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సారి జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని సమాయత్తం చేస్తున్నారు.

మరింత సమర్థవంతంగా..

గత ఏడాది 40,54,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 80శాతం మేర టార్గెట్‌ను పూర్తి చేశా రు. ఈ సారి కూడా 40,53,500 మొక్కల నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో నర్సరీల్లో భారీగా మొక్కలు ఎండిపోవడం, నాటిన వాటిని సక్రమంగా సంరక్షించకపోవడం తదితర కారణాలతో 80శాతం మొక్కలే బతికాయి. ఇది అధికారులు చెప్పే లెక్కలు మాత్రమే వాస్తవంగా కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే బతికాయి. ఈ సారి అలా కాకుండా నాటిన మొక్కల్లో 80 శాతానికిపైగా సంరక్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, రోడ్లపక్కన, పొలం గట్లపై మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

609 నర్సరీల్లో..

జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మొత్తం 609 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 15, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో 594 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీపీల్లోని ఒక్కో నర్సరీలో 5వేల నుంచి దాదాపు 30వేల మొక్కలు, 15 ఫారెస్టు నర్సరీల్లో కలిపి 10 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఫారెస్ట్‌ పీసెస్‌ కింద గచ్చకాయ, వెదురు, గుల్‌మోర్‌, రేన్‌ట్రీ, రావి, మర్రి, కానుగ, తురాయి, గార్డెనింగ్‌ మొక్కలు, దానిమ్మ, నిమ్మ, గోరింటాకు తదితర మొక్కలను పెంచుతున్నారు. హోం సీడ్‌ కింద (ఇళ్ల వద్ద నాటుకునేవి) పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

శాఖల వారీగా కేటాయించిన మొక్కలు

అటవీ 3.6లక్షలు

ఆర్‌అండ్‌బీ 5వేలు

జిల్లా పంచాయతీరాజ్‌ 4లక్షలు

డీఆర్డీఓ, ఎంపీడీఓలు 26.87లక్షలు

నీటిపారుదల 76వేలు

వ్యవసాయ 6.38లక్షలు

మార్కెట్‌ 5వేలు

ఉద్యానవన 2.55లక్షలు

(మరికొన్ని ఉప శాఖలకు

మొక్కలు కేటాయించారు.)

సిద్ధంగా ఉన్నాం

వనమహోత్సవ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం. అటవీ, డీఆర్‌డీఓ శాఖల ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. వర్షాలు పడగానే మొక్కలు నాటాలనే ఆదేశాలు జారీ చేశాం. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం కూడా పూర్తయ్యింది. అన్ని శాఖల సమన్వయంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేస్తాం. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాం.

– జ్ఞానేశ్వర్‌, డీఎఫ్‌ఓ

లక్ష్యం.. లక్షల్లో..1
1/1

లక్ష్యం.. లక్షల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement