
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఆదర్శ తులసీ నగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. ఉదయం 6గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. ధ్వజారోహణం, గణపతి హోమం, అభిషేకం, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం భక్త సురేష్‌చే ప్రవచనం, పలువురు పేరిణి శివతాండవంతో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు.
గోవుల అక్రమ రవాణా నేరం
తాండూరు రూరల్: గోవులను అక్రమంగాతరలిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని తాండూరు – చించోళి మార్గం గౌతా పూర్ సమీపంలో పోలీస్ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 7న బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోవులు, లేగ దూడల తరలింపు నేరమన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా పెంచామని తెలిపారు.
ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలి
సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్
పరిగి: కేంద్ర ప్రభుత్వం కావాలనే మావోయిస్టులపై కాల్పులు జరిపించి.. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్, మహేందర్ ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సోమవారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ పేరిట కాల్చి చంపారని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అమాయక ఆదివాసులపై దాడులు చేసి హతమార్చడం సరికాదన్నారు. మావోయిస్తు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని కాల్చి చంపి ఎన్‌కౌంటర్ పేరుతో కథలు అల్లుతున్నారని విమర్శించారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించే కుట్రలో భాగంగా ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయన్నారు. వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, శ్రీశైలం, నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు జిల్లాస్థాయి
సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్
తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో రేపు (28వ తేదీ బుధవారం) జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షుడు రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8, 10, 12 ఏళ్ల వయసు గల బాల బాలికలకు రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు తహసీల్దార్‌చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో నేరుగా రేపు ఉదయం 9గంటలకు మైదానానికి రావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 89782 34447, 63000 75229లలో సంప్రదించాలన్నారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

వైభవంగా ఆలయ వార్షికోత్సవం