
శిక్షణలో సమస్తం నేర్చుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్ ● లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం
అనంతగిరి: క్షేత్రస్థాయిలో వాస్తవికతను పరిశీలించి నివేదిక అందజేయాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంటుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్‌సీ భవనంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టానికి అనుగుణంగా భూముల సర్వే నిమిత్తం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో వికారాబాద్ జిల్లాలో 151 మందికి లైసెన్స్‌డ్ సర్వేయర్లను శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా భూ సర్వే ప్రక్రియ చేపట్టేందుకే శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ సమయంలో అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న వారు భూ భారతి చట్టంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. భూ వివాదాల జోలికి వెళ్లరాదని, అలాగే ప్రభుత్వ భూములను గుర్తించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ సామగ్రి కిట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కేశవ్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణలో సమస్తం నేర్చుకోవాలి