
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి
● మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన నాగారం దళితులు
ధారూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన దళితులు కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించలేదని తెలిపారు. 70 సంవత్సరాల నుంచి తమకు రిజర్వేషన్ సౌకర్యం లేక సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామంలో 1,500 జనాభా ఉండగా ఎస్సీలు 400మంది ఉన్నారని, రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సీతక్క, ఎన్నికల కమిషన్ అధికారి సానుకూలంగా స్పందించారని నాయకులు సుకుమార్, శ్రీనివాస్, లక్ష్మణ్, గణేశ్, నాగరాజ్ తెలిపారు.