
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం
● సర్కారు బడుల్లోనే పిల్లలను చేర్పించాలి ● డీఈఓ రేణుకాదేవి ● విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని డీఈఓ రేణుకాదేవి తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. పౌష్టికాహారం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం శ్రీశైలం మాట్లాడారు. ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోకుండా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు 500ల పైచిలుకు మార్కులు సాధించారని తెలిపారు. అనంతరం పదో తరగతిలో 538 మార్కులు సాధించిన విద్యార్థిని భవానీని సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బాబు సింగ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేశం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.