
బ్యాంక్‌లో పరిహారం సందడి
పారిశ్రామికవాడ భూ బాధితులతో కిటకిట
● నిత్యం కోట్ల రూపాయలలావాదేవీలు ● ఫిక్స్‌డ్ డిపాజిట్లు మేలంటున్న బ్యాంకర్లు
దుద్యాల్: దుద్యాల్ మండలం హకీంపేట్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిత్యం రైతులతో కిటకిటలాడుతోంది. పారిశ్రామికవాడ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇటీవల పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతుల ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఇక్కడే పరిహారం చెక్కులు డిపాజిట్ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందడంతో వందల మంది రైతులు వారివారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. దీంతో నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న మొత్తం సరిపోక ప్రధాన బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెస్తున్నట్లు తెలిసింది.
క్రాప్ లోన్ కట్టాలి
పారిశ్రామికవాడ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన పంట రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో కడితినే ఖాతాదారుల సిబిల్ స్కోర్ పడిపోకుండా ఉంటుందని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లోన్లు పొందేందుకు ఆస్కారం లేకుండా పోతుందని రైతులకు సూచిస్తున్నారు.
డిపాజిట్లు చేసుకోవడం ఉత్తమం
హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతులకు పరిహారం డ బ్బు అందింది. వచ్చి న డబ్బు ద్వారా ఆస్తు లు కొనుగోలు చేస్తే మంచిది. లేకుంటే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు.
– హరీష్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్, హకీంపేట్

బ్యాంక్‌లో పరిహారం సందడి