సేవలు అక్కడ | - | Sakshi
Sakshi News home page

సేవలు అక్కడ

May 7 2025 7:36 AM | Updated on May 7 2025 7:36 AM

సేవలు అక్కడ

సేవలు అక్కడ

ఆఫీసు ఇక్కడ
రెండేళ్లు కావస్తున్నా ఏర్పాటు కాని పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం

వికారాబాద్‌: జిల్లాకు పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం మంజూరై రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా సేవలు మాత్రం అందడం లేదు. నేటికీ రంగారెడ్డి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 2023 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం జిల్లాకు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కార్యాలయం తోపాటు ఎస్‌ఈ, ఈఈ, డీఈ పోస్టులను మంజూరు చేసింది. అప్పటిదాకా రంగారెడ్డి జిల్లా ఖైరతాబాద్‌ కార్యాలయం నుంచి సేవలు కొనసాగేవి. జిల్లాకు నూతన కార్యాలయం మంజూరు కావడంతో అప్పటి వరకు పని ఒత్తిడితో సతమతమవుతూ వచ్చిన అధికారులు ఇక కష్టాలు తీరుతాయని భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఎస్‌ఈ కార్యాలయం ద్వారా వికారాబాద్‌ జిల్లాతోపాటు పొరుగు జిల్లా అయిన నారాయణ్‌పేట్‌కు కూడా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి చేతులమీదు గా వికారాబాద్‌లో ఎస్‌ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సేవలు మాత్రం నేటికీ స్థానికంగా అందుబాటులోకి రాలే దు. ఇంత జరుగుతున్నా జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నేటికీ రంగారెడ్డి నుంచే..

జిల్లా కేంద్రం వికారాబాద్‌లో పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం ప్రారంభమై రెండేళ్లు పూర్తయినా సేవలు అందుబాటులోకి రాకపోవడానికి ఆ శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారే కారణమనే విమర్శలు ఉన్నాయి. వికారాబాద్‌లో ఎస్‌ఈ కార్యాలయం ప్రారంభం కాకుండా సూపరింటెండెంట్‌ రాకుండా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఎప్పటిలాగే రంగారెడ్డి జిల్లా(ఖైరతాబాద్‌) నుంచే వికారాబాద్‌ జిల్లా సేవలు కొనసాగేలా పథకం వేసినట్లు సమాచారం. జిల్లా ఏర్పాటైంది మొదలు ఈఈ వికారాబాద్‌లోనే సేవలందిస్తూ వచ్చారు. ఎస్‌ఈ పోస్టు, కార్యాలయం మంజూరయ్యాక కూడా ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా ఉంటూ వచ్చారు. నేటికీ వికారాబాద్‌, తాండూరు ఈఈ కార్యాలయాలు, ఇతర సబ్‌ డివిజన్లకు చెందిన ఫైళ్లను ఖైరతాబాద్‌కే తెప్పించుకొని సంతకాలు పెట్టి పంపిస్తున్నారు.

జిల్లాకు మంజూరైన కార్యాలయాలు

జిల్లాకు ఎస్‌ఈ కార్యాలయంతో పాటు తాండూరుకు ఈఈ కార్యాలయం, క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయం మంజూరయ్యాయి. 2023 వరకు వికారాబాద్‌లో మాత్రమే క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయం ఉండేది. ఆ తర్వాత తాండూరుకు అదనంగా మరో కార్యాలయాన్ని మంజూరు చేశారు. గతంలో వికారాబాద్‌లోని నాలుగు మండలాలకు కలిపి ఒక్కటే సబ్‌డివిజనల్‌ కార్యాలయం ఉండేది. రెండేళ్ల క్రితం వికారాబాద్‌, ధారూరు మండలాలకు కలిపి ఓ సబ్‌డివిజన్‌ కార్యాలయం, మోమిన్‌పేట, తాండూరు మండలాలకు కలిపి మరో సబ్‌ డివిజనల్‌ కార్యాలయాన్ని మంజూరు చేశారు. వికారాబాద్‌ సబ్‌డివిజన్‌ నుంచి విడిపోయిన మోమిన్‌పేట, నవాబుపేటను ప్రత్యేక సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సేవలన్నీ స్థానికంగా కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌లో పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉన్నా జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా కేంద్రం నుంచి పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయ సేవలు అందేలా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

నేటికీ ఖైరతాబాద్‌ నుంచే కార్యకలాపాలు

అధికారులకు తప్పని ఫైళ్ల మోత

ఓ అధికారి తతంగం వల్లే ఈ పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement