
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ● వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం
అనంతగిరి: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా జాబితాను రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ధ్రువీకరణ ప్రక్రియపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకు చెందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా వచ్చిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి కుటుంబాల స్థితిగతులను తెలుసుకొని పారదర్శకంగా జాబితాను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఎస్‌హెచ్‌ఓ సత్తార్, హౌసింగ్ డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
వేగం పెంచండి
కొడంగల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం ఆయన కొడంగల్‌లో పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. ఇంటి నిర్మాణంలో పారదర్శకంగా వ్యవరించాలన్నారు. అర్హులైన పేదలకు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే కట్టుకోవాలి
దుద్యాల్: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగాయిపల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగాయిపల్లికి 62 ఇళ్లు మంజూరు కాగా 12 మంది బేస్‌మెంట్ పనులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేసినట్లు వివరించారు. మరో 22 ఇళ్లు పునాది దశలో ఉన్నట్లు తెలిపారు. 28 ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసినట్లు వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ చందర్ నాయక్, డీఎల్‌పీఓ శంకర్ నాయక్, దుద్యాల్, కొడంగల్ ఎంపీడీఓలు మహేష్‌కుమార్, ఉషా శ్రీ, ఎంపీఓ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.