
దిగుబడి తగ్గకుండా..
కందుకూరు: అధిక ఉష్ణోగ్రతలు, పొడి గాలులు, జల వనరులు తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో వేసవి కాలంలో కూరగాయల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. ఫలితంగా రైతులు నష్టపోతుంటారు. ఈ సమస్యలను అధిగమించి, ఎండల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ తెలిపారు. వేసవిలో కూరగాయల సాగుపై ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
అనువైన పంటలు
టమాటా, వంగ, బెండ, పచ్చి మిర్చి, సొర, కాకర, బీర, కూరదోస, పొట్ల, గోరు చిక్కుడు, చేమ, కంద, ముల్లంగి, తోటకూర, పాలకూర పంటలు వేసవిలో సాగు చేసుకోవచ్చు.
మొక్కల సాంద్రత పెంచడం
● వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
● మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచాలి. దీంతో విడిగా ఒక్కో మొక్క నుంచి దిగుబడి తగ్గినప్పటికి, ఎక్కువ మొక్కలు ఉండటంతో మొత్తం విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందు కోసం విత్తన మోతాదు పెంచాలి.
ఎరువుల యాజమాన్యం
● సమగ్ర పోషక యాజమాన్యం పాటిస్తే భూభౌతిక లక్షణాలు మారడమే కాకుండా సూక్ష్మపోషకాలు కూడా లభ్యమవుతాయి.
● సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడితే భూమిలో తేమను నిలిపి ఉంచే గుణం పెరగడమే కాకుండా, సూక్ష్మ జీవుల చర్యలు అధికమై మొక్కలకు పోషకాల లభ్యత పెరుగుతుంది.
● జీవన ఎరువులైన అజిటోబాక్టర్, అజోస్పైరిల్లిం, పాస్పోబాక్టీరియాను ఎకరానికి 2 కిలోల చొప్పున వాడటంతో సిఫారుసు చేసిన నత్రజని, భాస్వరం ఎరువుల్లో 25 శాతం ఆదా చేయవచ్చు.
● 30, 45, 75 రోజులకు 2శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేస్తే నత్రజని ఆదాతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే వీలుంది.
● పొటాష్‌ను సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకునే గుణం పెరుగుతుంది.
● 9 కిలోల యూరియాకు ఒక కిలో వేప పిండిని కలిపి వేయాలి. లేదా 25 కిలోల యూరియాకు ఒక కిలో వేప నూనెను కలిపి అరగంట సేపు ఆరబెట్టి పంటకు అందించాలి.
● జింక్, బోరాన్, కాల్షియం, మెగ్నీషియం మొదలైన సూక్ష్మధాతు లోపాలు కనిపించే అవకాశం ఉంది.
● మిరప, చేమ పంటల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ దుక్కిలో వేయాలి లేదా లీటరు నీటికి 2కిలోల జింక్ సల్ఫేట్ కలిపి మిరపలో పూతకు ముందు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
● 3 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పూత, పిందె సమయంలో వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయాలి.
● బ్లూజమ్‌ఎండ్ రాట్ అనగా కాయ తొడిమ వద్ద నల్లగా మారే సమస్య నివారణకు కాల్షియం నైట్రేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వేసవి తాపాన్ని తట్టుకునేలా..
● నేల ఉష్ణోగ్రత తగ్గించడానికి వరుసల మధ్య ఎండుగడ్డి, రంపపుపొట్టు, వరి పొట్టు, పశువుల ఎరువు మొదలైనవి పరచాలి.
● టమాటాలో పాక్షికంగా నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్నలాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటు కోవాలి. లేదా 35 శాతం షేడ్ నెట్‌లను ఏర్పాటు చేస్తే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి.
● పండ్ల తోటల్లో సొర, దోస, గుమ్మడి, బెండ, గోరుచిక్కుడు వంటి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
● తుంపర పద్ధతిలో నీరు ఇవ్వడంతో నీటి ఆదాతోపాటు ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు.
● సూక్ష్మపోషకాలు, హార్మోన్లు చల్లి పూత రాలడాన్ని అరికట్టాలి. ఫలితంగా మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.
మేలైన యాజమాన్య పద్ధతులతో వేసవిలోనూ లాభాల పంట
కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ

దిగుబడి తగ్గకుండా..