
ఫలించిన డిజిటల్ బోధన
దుద్యాల్: పదో తరగతి ఫలితాల్లో పేదింటి బిడ్డలు సత్తా చాటారు. మండల పరిధిలోని చెట్టుపల్లితండా సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. బాలికల సాధనతో పాటు అత్యాధునిక వసతుల కల్పన ఏర్పాటుతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులు విద్యార్థినులకు ఎంతగానో తోడ్పడ్డాయి. తరగతి గదిలో పాఠాలు బోధించిన తర్వాత ప్రత్యేకంగా డిజిటల్ క్లాసులు సైతం నిర్వహించేవారు. అర్థంకాని అంశాలను ప్రత్యేక తరగతిలో బాలికలు నివృత్తి చేసుకునేవారు. దీనికి తోడు స్టడీ అవర్‌లు నిర్వహించి కఠోర సాధన చేసేవారు. వాటి ఫలితంగానే మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలుపతున్నారు.
ఉపాధ్యాయుల సూచనలు
ఉపాధ్యాయుల మార్గదర్శకాలను అనుసరించిన విద్యార్థినులు ఉత్తమ మార్కులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ఖ్యాతి గడించారు. 44 మంది బాలికలు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత పొందారు. అత్యధికంగా 494 మార్కులతో సంధ్యారాథోడ్, 480 మార్కులతో అంజలి, పూజ, 475 మార్కులతో తనుజ మెరిశారు. గత సంవత్సరం పది ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ సారి మాత్రం దుద్యాల్ మండలంలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా ఈ కేజీబీవీ నిలిచింది.
పది ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా
నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన
బాలికలు
ఆనందం వ్యక్తం చేస్తున్న
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

ఫలించిన డిజిటల్ బోధన