
సాగులో మనమే అగ్రగామి
● జూన్ 2న రైతులకు ఫౌండేషన్ సీడ్స్ పంపిణీ ● ‘రైతుల ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
ధారూరు: పంటల సాగు, దిగుబడుల సాధనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా ధారూరులోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతుల ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రైతులందరికీ ఫౌండేషన్ సీడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విత్తనాలతో పండించిన పంటను నేరుగా విక్రయించకుండా ఆయా గ్రామాల్లోని ఇతర రైతులకు విత్తనంగా అందిస్తే, విత్తనాలను కొనుగోలు చేసే బాధ తప్పుతుందన్నారు. రైతు పండించే విత్తనం నాణ్యమైనదని, మోసం జరిగే వీలుండదని చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పంటలు సరిగ్గా పండకున్నా, ఎకరా భూమి అమ్మితే రూ. కోట్లు వస్తాయని, ఒక్క ధారూరు మండలంలోనే 5 వేల ఫాంహౌస్‌లు ఉన్నాయంటే ఇక్కడి భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. జిల్లాకు సాగునీరు వచ్చేలా చూడాలని మంత్రి తుమ్మలను కోరారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ పంటల సాగులో రసాయనాలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు సునీల్, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ అల్తాఫ్ జానయ్య, కమిషనర్ గోపి, డైరెక్టర్ విజయకుమార్, కలెక్టర్ ప్రతీక్‌జైన్ పాల్గొన్నారు. అనంతరం ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’అనే కరపత్రాలను ఆవిష్కరించారు.