
సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత
పోలీసునని చెప్పి..ఐపీఎల్ టికెట్లు లాక్కొని పరార్
శంషాబాద్ రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్‌ఓసీ పత్రాలను ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ శనివారం అందజేశారు. మండలంలోని న ర్కూడ వాసి పి.పద్మ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె వైద్య సహాయం కోసం ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు నీరటి రాజు, ఎస్.శ్రీనివాస్, శేఖర్, విశ్వనాథం, ప్రభు, నర్సింహా, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
సనత్‌నగర్: పోలీసునని చెప్పి బెదిరించి యువకుల నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను లాక్కొని పరారైన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన వంగూరి రాకేష్ ఈ నెల 5వ తేదీన నగరంలో జరిగే ఎస్‌ఆర్‌హెచ్, డీసీ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించడం కోసం 16 టికెట్లను కొనుగోలు చేసేందుకు స్నేహితులైన పవన్, రామకృష్ణలతో కలిసి నగరానికి వచ్చాడు. మొదట హిమాయత్‌నగర్‌లోని టికెట్ బుకింగ్ కేంద్రానికి వెళ్లి 16 టికెట్ల కోసం ప్రయత్నించగా 8 టికెట్లు మాత్రమే దొరికాయి. మరో 8 టికెట్ల కోసం జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ కష్టపడి మరో 8 టికెట్లను కొనుగోలు చేసి బయటకు వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అడ్డగించాడు. తనకు నాలుగు టికెట్లు విక్రయించాలని, రూ.2,500ల చొప్పున విలువ చేసే టికెట్లకు రూ.5,000 చొప్పున చెల్లిస్తానన్నాడు. తొలుత నిరాకరించిన యువకులు ఆ తర్వాత టికెట్లను విక్రయించేందుకు ఒప్పుకున్నారు. మళ్లీ సదరు వ్యక్తి మరో 6 టికెట్లు కావాలని అడిగాడు. టికెట్లు ఇచ్చేందుకు యువకులు నిరాకరించడంతో వారిని బెదిరించాడు. వారికి పోలీసు గుర్తింపు కార్డు చూపించి తాను టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారినని, బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని, అందరినీ జైలుకు పంపుతానని బెదిరించి వారిని బేగంపేట పోలీస్‌స్టేషన్ సమీపం వరకు తీసుకువచ్చాడు. మొత్తం 16 టికెట్లతో పాటు యువకుల వద్ద ఉన్న రూ.1700 తీసుకుని వారిని తిరిగి పరేడ్‌గ్రౌండ్ వద్ద దించి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తిపై అనుమానం వచ్చిన యువకులు బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.