
సినీ నటుడు విజయ్‌దేవరకొండపై ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓ సినిమా రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై తమ సంఘం తరఫున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం
ఆమనగల్లు: మండల పరిధిలోని కోనాపూర్‌గేటు సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో అమెజాన్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గుర్రంగుట్ట కాలనీకి చెందిన కావటి శ్రీకాంత్(25) ఆరేళ్లుగా తుక్కుగూడ సమీపంలో ఉన్న అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకు హాజరైన ఆయన తన బైక్‌పై శనివారం ఇంటికి వస్తున్న క్రమంలో సుమారు ఉదయం 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం మృతుడి కుటుంబీకులను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పరామర్శించారు.
ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం
రూ.15 లక్షల చెక్కు అందజేసిన
కేసర్ ఇండసీ్ట్రస్
షాద్‌నగర్: దాతల సహకారంతో షాద్‌నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి కేసర్ ఇండస్ట్రీస్ అధినేత బంకట్ లాల్‌బాటీ శనివారం భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసిన రూ.15 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరిందని.. దాతల సహకారంతో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థుల చదువులకు దాతలు సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కాశీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సినీ నటుడు విజయ్‌దేవరకొండపై ఫిర్యాదు