● రంగుల పండుగకు యువత సిద్ధం ● రసాయనాలతోముప్పు తప్పదంటున్న వైద్యులు ● సహజ రంగులు మేలని సూచన
తాండూరు: రంగుల పండుగ హోలీ రానేవచ్చింది. వేడుకలు ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం..
సహజ రంగులు మేలు
హోలీ సందర్భంగా రసాయన రంగుల వాడితే చ ర్మం, కళ్లకు ముప్పు.సహజ సిద్ధ రంగులు (హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడి) వాడితే చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా చర్మ వ్యాధుల నుంచి ఈ రంగులు రక్షణ కల్పిస్తాయి.
రసాయనాలు వద్దు
రంగుల తయారీలో ప్రాణాంతక రసాయనాలను వాడతారు. వాటిని ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
నీటి వృథాను అరికట్టాలి
రంగుల్లో అపరిశుభ్రమైన నీటిని కలిపి చల్లుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పట్టణాల్లో నీటి ఎద్దడి ప్రారంభమైన తరుణంలో హోలీ పేరిట నీటిని వృథా చేయరాదని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. హోలీ ఆడిన తర్వాత స్నానానికి చెరువుల్లోకి వెళ్లే యువత జాగ్రత్తలు పాటించాలి. ఈత రాకుంటే చెరువుల్లోకి దిగరాదు. జలాశయాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయాలి.
ఈ సూచనలు పాటించాలి
● ఒక వేళ హోలీ వేడుకల్లో రసాయన రంగులను వాడాల్సి వస్తే అవి శరీరంపై ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలి.
● ఎరుపు, పింగ్ కలర్ రంగులు వాడితే మంచిది. ఇవి తక్కువ గాఢత కలిగి ఉంటాయి. శరీరం పైనుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఆరెంజ్, పసుపు రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉంటాయి. ఆ రంగులను శరీరం పైనుంచి తొలగించడం కష్టం.
● హోలీ ఆడటానికి ముందు ముఖానికి నూనె రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. శుభ్రం చేయడం కూడా సులభతరం.
● ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా షాంపో వాడటం మంచిది.
● రంగులకు పలు రకాల ఆయిల్ కలిపి శరీరానికి రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాటిని శుభ్రం చేయడం కష్టం. ఎక్కువ నీటిని వినియోగించాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు పాటించాలి
రంగులుచల్లుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చిన్నారులు హోలీ ఆడే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలి. ఒక వేళ రంగులు కళ్లల్లో పడితే వెంటనే శుభ్రం చేయాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల లోపు హోలీ వేడుకలు ముగించాలి.
– డాక్టర్. రవిశంకర్, సూపరింటెండెంట్,
జిల్లా ఆస్పత్రి, తాండూరు
రేపే హోలీ