క్రీడా ప్రాంగణం..
గ్రామీణ యువత, విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే సదుద్దేశంతో గతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆహ్లాద వాతావరణంతో చిన్నారులకు తర్ఫీదును ఇవ్వాల్సిన ప్రాంగణాలు కొన్నిచోట్ల ఊరికి దూరంగా బండరాళ్లు, గుట్టల నడుమ క్రీడలకు ఏ మాత్రం ఆమోదయోగ్యం లేకుండా వెలవెలబోతున్నాయి.
దుద్యాల్: ప్రతి గ్రామంలోని యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి పెంచుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో వాటిని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయగా, మరికొన్నింటిని బడికి సమీపంలోని స్థలం చూసి విద్యార్థులకు ఉపయుక్తంగా నెలకోల్పారు. అందులో మండల పరిధిలోని చాలా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఊరికి దూరంగా ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారాయి. మండల పరిధిలోని చిలుముల మైల్వార్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఊరిలో ఉంటే.. క్రీడా ప్రాంగణము రెండు కిలో మీటర్ల దూరంలోని అడవిలో ఏర్పాటు చేశారు. పైగా అందులో పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. దీంతో ఆటలు ఆడేందుకు యోగ్యం లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చెట్ల పొదలతో ఇబ్బంది
చిలుముల మైల్వార్ గ్రామం అటవీ ప్రాంతంలో ఉన్న మామిడికుంట ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లే మార్గ మధ్యలో ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. చుట్టుముట్టూ చెట్ల పొదలు, గుట్టలతో భయంకరంగా ఉందని గ్రామ యువకులు వాపోతున్నారు. దీంతో క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. ఆటలు ఆడుకోవడానికి అనువైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని గ్రామ సమీపంలోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఊరికి దూరంగా ఆట స్థలం కేటాయింపు
వెళ్లలేక అవస్థలు పడుతున్న
విద్యార్థులు, యువకులు