
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ కేఎస్‌రావు
ఇబ్రహీంపట్నం: మంచాల పీఎస్ పరిధిలో ఆరేళ్ల క్రితం బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సోమ వారం ఎల్బీనగర్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్ రావు, మంచాల సీఐ కాశీ విశ్వనాథ్, ఎస్‌ఐ రవినాయక్ వివరాలు వెల్లడించారు. 2017లో మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సభావత్ అంజిత్ కుమార్(28) గ్రామానికి చెందిన బాలకపై ప్రేమ పేరిట అత్యాచారం చేశాడు. అప్పటి సీఐ గంగారాం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ న్యాయస్థానంలో కేసును విచారించిన జడ్జి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ.10లక్షల పరిహారం మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన ఐఓ గంగారం, ఏపీపీ సునీత, కోర్టు డ్యూటీ ఆఫీసర్ రాజేశ్వరి (డబ్లూపీసీ 1045)ని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ అభినందించారని.. వారికి రివార్డులను అందజేయనున్నట్లు ఏసీపీ కేఎస్ రావు తెలిపారు.