జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు
హాజరు కానున్న 34 వేల మంది
విద్యార్థులు
●
తిరుపతి సిటీ: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 4వ తేదీవరకు జరగనున్న పరీక్షలకు రికార్డు స్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ జనరల్ పబ్లిక్ పరీక్షలను తలపించేలా సప్లిమెంటరీ పరీక్షలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా వ్యాప్తంగా 34,380 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా సబ్జెక్టులు తప్పిన విద్యార్థులతో పాటు ఫస్ట్, సెకండ్ ఇయర్‌లలో మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం ఇవ్వడంతో భారీ ఎత్తున సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ జనరల్ పబ్లిక్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పరీక్షలకు హాజరు కాగా ఫస్ట్ ఇయర్ 78శాతం, సెకండ్ ఇయర్‌లో 80శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాలో సప్లిమెంటరీ విద్యార్థుల సమాచారం
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు(జనరల్) 22,213
ఒకేషనల్ విద్యార్థులు 639
సెకండ్ ఇయర్ విద్యార్థులు(జనరల్) 11,702
ఒకేషనల్ విద్యార్థులు 465
పరీక్ష కేంద్రాలు 52
సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు 3
ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు 3
సిట్టింగ్ స్క్వాడ్‌లు 6
రేపటి నుంచి ఇంటర్
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లా వ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షలకు 52 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య శిబిరాలు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో పిచ్చాటూరు, నాగలాపురం, నాయుడు పేట సెంటర్లను సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే 0877 2237200 నంబర్‌కు తెలియచేస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం. – జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి


